ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ కన్నా భారత్(India) వెనకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో జరుగుతోన్న భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దేశంలో నిరుద్యోగితకు కారణం మోడీ ప్రభుత్వం అవలంభించిన విధానాలే కారణమని రాహుల్ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు నష్టం కలిగిందని తెలిపారు. యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆయన ఫైర్ అయ్యారు.
గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు. పాకిస్థాన్ కన్నా భారతదేశంలో నిరుద్యోగం రెట్టింపుగా ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్ కన్నా దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారని వివరించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తీసుకురావడంతో చిరు వ్యాపారులు కనుమరుగు అయ్యారని ఆయన మండిపడ్డారు.
అదేవిధంగా సంపన్నులను దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వేలో కొత్త విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. వివిధ ఛార్జీల పేరుతో టికెట్టు ధరలను పెంచడమే కాకుండా.. ఏసీ బోగీలను గణనీయంగా పెంచుతూ సాధారణ ప్రయాణికులకు రైల్వేలను దూరం చేస్తోందని దుయ్యబట్టారు. భారతీయ రైల్వే విధానాలను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపడ్డారు.