వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. లారీ డ్రైవర్లు, మెకానిక్ లు, రైతులు ఇలా పలు వృత్తుల వారిని కలవడంతో వారితో కలిసి కాసేపు పని చేయడం చేస్తున్నారు. దీనిద్వారా ఆయా వర్గాల ప్రజలకు అండగా ఉంటామనే సంకేతాన్ని ఇచ్చి ఓట్లు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా సిక్కుల పవిత్ర స్థలం అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) సందర్శించారు.
సాధారణ భక్తుడిలా ప్రార్థనల్లో పాల్గొన్నారు రాహుల్. సెలవు రోజు కావడంతో గోల్డెన్ టెంపుల్ రద్దీగా మారింది. అయినా, వారితో కలిసి ప్రార్థనలు చేశారు రాహుల్ గాంధీ. తలకు నీలం రంగు వస్త్రం కట్టుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ కిచెన్ లో అల్పాహారాన్ని తీసుకున్నారు. అక్కడే వలంటరీ సేవల్లో పాల్గొన్నారు. భక్తులు ఉపయోగించిన గిన్నెలను కడిగారు.
ఈమధ్య ఢిల్లీలోని కీర్తినగర్ ఫర్నిచర్ మార్కెట్ కు వెళ్లారు రాహుల్. కార్పెంటర్ షాపులను సందర్శించారు. వడ్రంగులతో ముచ్చట్లు పెట్టారు. అంతకుముందు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. సూట్ కేసులను సైతం మోశారు. ఛత్తీస్ గఢ్ లో బిలాస్ పూర్ నుంచి రాయ్ పూర్ వరకు రైలులో ప్రయాణించారు. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ ను సందర్శించి గిన్నెలు కడిగారు. మంగళవారం ఉదయం జరిగే పల్కి సేవా కార్యక్రమంలోనూ రాహుల్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.