బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలంగాణ (Telangana) , ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాలు ప్రారంభమవడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అవుతున్నారు. మరో వైపు ఈ వర్షాలకు హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ నిలిచిపోవడం, నీట మునిగిన కాలనీలతో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఇది ఇలా ఉండగా…ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, కడప, అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలోని కంబాల చెరువు, దేవిచౌక్ గోకవరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. కడప జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.
ఇటు శ్రీసత్యసాయి పుట్టపర్తిలోనూ రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. వరదతో వాగులు, వంకలను తలపిస్తున్నాయి రహదారులు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు చిత్రావతి నదిలో వరద పొటెత్తింది. దీంతో రాయవారిపల్లి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కోవెలగుట్టపల్లి వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు