వేసవి(Summer) కావడంతో రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగాయి. భానుడి తాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండవేడిమికి అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వరుణుడు ప్రజలకు కాస్త ఊరటనిచ్చాడు. ఆదిలాబాద్(Adilabad)లో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. దీంతో అక్కడి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
ఇన్ని రోజులు ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరుజల్లులతో ఊపిరి పీల్చుకున్నట్లైంది. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు(Rain) కురుస్తాయని తెలిపింది.
హైదరాబాద్‌లో మాత్రం కురిసే ఛాన్స్ లేదని స్పష్టంచేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని పేర్కొంది.
7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.