సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన తాజా చిత్రం జైలర్. ఈ మాస్ ఎంటర్ టైనర్ గురువారం రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే చెన్నై(Chennai)లో ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో రజినీకాంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ (YCP) నేతలకు కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది.
రజినీకాంత్ ఏమన్నారంటే..?
మొరగని కుక్కలేదు..
విమర్శించని నోరు లేదు..
ఇవి రెండూ జరగని ఊరు లేదు..
మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అని తమిళంలో మాట్లాడిన రజినీకాంత్ చివర్లో అర్థమైందా రాజా? అని తెలుగులో అన్నారు. ఈ డైలాగ్ తెలుగు రచయిత పోసాని కృష్ణమురళి బ్రాండ్. ఆయన తరచూ ఈ పదాన్ని వాడుతుంటారు. పైగా, వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే రజినీకాంత్ ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు.
అసలు, వివాదం ఏంటి..?
కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్.. అభివృద్ధి, చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ తెగ పొగిడేశారు. దీనిపై వైసీపీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తం అయింది. సోషల్ మీడియాలో అయితే.. తలైవాను ఓ ఆటాడుకున్నారు. వివాదాస్పద విషయాలను తెరపైకి తెచ్చి టార్గెట్ చేశారు. వైసీపీ నేతలు అయితే మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దీనిపై రజినీ అభిమానులు సైతం అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.
పోసాని వ్యాఖ్యలు.. రజినీ కౌంటర్
రజినీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగిడినా తమకు అభ్యంతరం లేదని ఆనాడు పోసాని అన్నారు. ఆయన చెన్నైలో మాత్రమే సూపర్ స్టార్.. తెలుగు వాళ్లకు కాదని.. తమకు చిరంజీవే సూపర్ స్టార్ అని కామెంట్స్ చేశారు. అప్పుడు రజినీకాంత్ వైసీపీ గురించి ఏమీ మాట్లాడకపోయినా ఆయన్ను టార్గెట్ చేయడంపై తాజాగా జైలర్ ఆడియో ఫంక్షన్ లో ‘అర్థమైందా రాజా’ అంటూ కౌంటర్ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు.