Telugu News » Ayodhya : ఔరా అనిపించే శిల్పకళా వైభవం

Ayodhya : ఔరా అనిపించే శిల్పకళా వైభవం

అయోధ్య ఆలయంతోపాటు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం అందించిన సహకారం ఏంటి? ఇలాంటి మరిన్ని విశేషాలను తర్వాతి కథనంలో చూద్దాం.

by admin
ayodhya-ram-mandir

అబ్బురపరిచే ఆకృతిలో నిర్మాణం జరుపుకున్న అయోధ్య (Ayodhya) రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలుస్తోంది. ఎంతలా అంటే 2వేల ఏళ్లయినా ఆలయం చెక్కుచెదరకుండా నిర్మాణం చేశారు. భూకంపం సంభవించినా.. రిక్టర్‌ స్కేల్‌ పై 10 తీవ్రత నమోదైనా మందిరానికి ఏమీకాదు. ఇంతటి విశిష్టత కలిగిన అయోధ్య రామ ఆలయం విశేషాలను ప్రజలకు తెలియజేస్తోంది ‘రాష్ట్ర’ (Raashtra). ఈ కథనంలో ఆలయంలోని శిల్పకళా వైభవం గురించి తెలుసుకుందాం.

ayodhya-ram-mandir

రామ మందిరం గర్భాలయానికి చేరుకోవడానికి ఐదు మంటపాల తర్వాత మూడు ప్రవేశ ద్వారాలు నిర్మించారు. వీటిలో రాజస్థాన్ వైట్ మార్బుల్ రాళ్లను అమర్చారు. దానిపై అద్భుతమైన శిల్పాలు చేశారు. ఈ అద్భుత మందిర శిల్ప సౌందర్యం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. రామాలయం గ్రౌండ్ ఫ్లోర్‌ లో 167 స్తంభాలు ఏర్పాటు చేశారు. వాటిలో వివిధ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. స్తంభంపై చెక్కబడిన దేవతామూర్తుల విగ్రహాలు రామభక్తులకు ఆకర్షణీయంగా చూపుతిప్పుకోని విధంగా ఉన్నాయి.

నాగర శైలిలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన శిల్పాలు చేశారు శిల్పులు. ప్రాణం పెట్టి వీటిని రూపొందించారు. ప్రాచీన శిల్ప శాస్త్రాన్ని పాటిస్తూ అనుసరిస్తూ 3,600 శిల్పాలను అయోధ్య ఆలయంలో భాగం చేశారు. ఇందులో దేవీదేవతల విగ్రహాలు, ప్రాచీన‌త ఉట్టిప‌డే డిజైన్లు, మొద‌లైన‌వి ఉన్నాయి. అంతే కాకుండా ఆల‌య స్తంభాలు, పైక‌ప్పుల‌నూ క‌ళాత్మ‌క‌త ఉట్టిప‌డేలా తీర్చిదిద్దారు.

మందిరం వెలుపల గజరాజు, హనుమంతుడు, గరుడ, సింహాం విగ్రహాలను ఏర్పాటు చేశారు. లేత గులాబీ రంగులో ఉన్న ఈ విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వీటిని తయారు చేసిన రాళ్లను రాజస్థాన్‌ లోని బన్సిపహద్‌ పూర్ గ్రామం నుంచి తీసుకొచ్చారు. ఈ రాయిని ఇసుక రాయి అంటారు. ఈ ఇసుకరాతి విగ్రహం రామ మందిర సౌందర్యాన్ని పెంచింది. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే ఆలయ మెట్లకు సమీపంలోనే ఇవి ఉన్నాయి. ఈ కళాఖండాలను బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ కు చెందిన కళాకారులు తయారు చేశారు. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు నుండి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడే ఇవి దర్శనమిస్తాయి.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారుపూత పూసిన 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేస్తున్నారు. రామ మందిరాన్ని రూ.1000 కోట్ల‌తో నిర్మించారు. నిర్మాణం దృఢంగా ఉండేందుకు స్టీల్ జాయింట్ల స్థానంలో రాగి జాయింట్ల‌ను ఉప‌యోగించారు. ప్ర‌ధాన ఆల‌యం, ఉపాల‌యాల స‌ముదాయం, మ్యూజియం, డిజిట‌ల్ ఆర్కైవ్స్‌, రీసెర్చ్ సెంట‌ర్ల నిర్మాణానికి ఆగ‌స్టు 5, 2020లో ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేశారు.

అయోధ్య ఆలయంతోపాటు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం అందించిన సహకారం ఏంటి? ఇలాంటి మరిన్ని విశేషాలను తర్వాతి కథనంలో చూద్దాం.

You may also like

Leave a Comment