తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో నేతలు జోష్ పెంచారు.. మరోవైపు తాయిలాలు పంచడంలో, అక్రమ నగదు రవాణా జరగడంలో కూడా వేగం పెరిగింది. ఎన్నికలకు కూడా ఎక్కువగా సమయం లేకపోవడం వల్ల నేతలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెల్లుతున్నారు. మరోవైపు అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అయినా నగదు రవాణా ఆగడం లేదు..
తాజాగా రంగారెడ్ది (Rangareddy) జిల్లాలోని పెద్ద అంబర్పేట్ (Pedda Amberpet) ఓఆర్ఆర్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. చౌటుప్పల్ తీసుకెళ్తున్న కారులో రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తులు ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపించక పోవడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు సీజ్ చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.కోటి ఇరవైలక్షలు పట్టుబడ్డాయి. నాగోల్‌కు చెందిన సునీల్ రెడ్డి, శరత్ బాబు కారులో నాచారం నుంచి భువనగిరి (Bhuvanagiri) వెళ్లుతున్న సమయంలో.. తనిఖీ కోసం పోలీసులు కారును ఆపారు.. అప్పుడు వారు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు.
దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి భయపడి నగదును రవాణా చేస్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. వెంటనే నగదును స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు..