రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో భారీ పేలుడు (Severe Blast) సంభవించింది. ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తాజాగా కొందుర్గు (Kondurg)లోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమ (Scan Energy Factory)లో భారీ పేలుడు చోటు చేసుకోగా.. ఈ పేలుడు ధాటికి కంపెనీ షెడ్ కుప్పుకూలింది.
ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీలో దట్టమైన పొగ అలుముకొంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఈమేరకు స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా. అనే సందేహంతో గాలిస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలయవలసి ఉంది.
మరోవైపు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షేక్ పేట్ డివిజన్ ఫుట్ పాత్ మీద ఉన్న దుకాణాల్లో ప్రమాదం జరగ్గా.. ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసినట్లు సమాచారం.