ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(RCB) ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్వెల్, డానియెల్ వెటోరి వంటి అంతర్జాతీయ స్టార్లు జట్టులో ఉన్నా ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. అయితే ఆర్సీబీ ఇంకా టైటిల్ గెలవలేకపోవడానికి గల కారణాలను టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వెల్లడించాడు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాయుడు ఐపీఎల్ టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ లైవ్’లో అంబటి రాయుడు మాట్లాడుతూ కీలక విషయాలను తెలిపాడు. భారీ మొత్తాలు తీసుకుంటున్న అంతర్జాతీయ క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతుండటమే ఆర్సీబీ టైటిల్ కరవుకు కారణమని చెప్పుకొచ్చాడు.
ఆ జట్టు బౌలర్లు ఎప్పుడూ ఎక్కువ పరుగులు ఇస్తారని అయితే బ్యాటింగ్ విభాగం సరైన ప్రదర్శన చేయదని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్ చేస్తున్న వాళ్లంతా భారత యువ బ్యాటర్లేనని తెలిపాడు. వారిలో దినేష్ కార్తీక్ పేరును ప్రస్తావించాడు అంబటి రాయుడు. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించాడు.
క్లిష్ట పరిస్థితుల్లో అందరూ డ్రెస్సింగ్ రూముల్లో ఉంటారని, 16 ఏళ్లుగా ఇదే జరుగుతోందని చెప్పుకొచ్చాడు. తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు స్టార్ ఆటగాళ్లు ఎప్పుడూ క్రీజులో నిలబడరని, యువ ఆటగాళ్లంతా బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వస్తున్నారని తెలిపాడు. స్టార్ బ్యాటర్లంతా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నారు. కఠిన సమయాల్లో క్రీజులో సీనియర్లు ఎవరూ ఉండరని, ఇలాంటి జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవలేదని రాయుడు అన్నాడు.