ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ (CM Kejiriwal) ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మద్యం పాలసీని(liquor policy) ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించడం వెనుక ‘క్విడ్ ప్రోకో’ (సమ్ థింగ్ రిటర్న్) కింద రూ.వందల కోట్లు చేతులు మారాయని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో వారం రోజుల పాటు ఆయన్ను కస్టడీ లోకి తీసుకుంది.
ప్రస్తుతం ఈ కేసులో సుమారు 12 మందికి పైగా నిందితులు జైలులో ఉన్నారు. వీరితో పాటే సీఎం కేజ్రీవాల్‌ను కూడా ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీలో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారం మొత్తం కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగిందని, ఆయనే కింగ్ పిన్ అని ఈడీ ఇప్పటికే కోర్టుకు వివరించింది. అందుకే ఆయన్ను విచారించడానికి కోర్టు అనుమతితో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకుంది.
తాజాగా కేజ్రీవాల్ జైలులో నుంచి ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా నేరవేరుస్తానని ప్రకటించారు . ఈ క్రమంలోనే కేజ్రీవాల్ శనివారం రౌస్ అవెన్యూ కోర్టుకు ఒక దరఖాస్తు చేస్తారు. అందులో ఓ పోలీస్ అధికారిపై ఆరోపణలు చేశారు. తనను ఇంటి నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించే క్రమంలో ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని, అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలని కోర్టును కోరారు.
కాగా, గతంలో మనీశ్ సిసోడియాను మెడ పట్టుకుని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగ్ కావడం గమనార్హం. అయితే, కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉన్నది.