– బీజేపీకి చంద్రశేఖర్ గుడ్ బై
– అధిష్టానానికి లేఖ
– చంద్రశేఖర్ గురించి ముందే చెప్పిన ‘రాష్ట్ర’
– రంగంలోకి రేవంత్ రెడ్డి
– చంద్రశేఖర్ చేరికపై చర్చలు
– 18న ఖర్గే సమక్షంలో చేరే ఛాన్స్
రాష్ట్రానికి చీడ, పీడ రెండూ కూడా సీఎం కేసీఆరేనని టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ చేరికపై చర్చలు జరిపేందుకు ఆయన నివాసానికి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని, ఇందుకు ఆయన అంగీకరించారని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చంద్రశేఖర్ తన వంతు కర్తవ్యం నిర్వహించారన్నారు.
దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కు కల్పించాలని ఆయన సూచించారని, దీనికి పార్టీ అంగీకరించిందని చెప్పారు. ఈ నెల 18న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతానని చంద్రశేఖర్ ఆ తరువాత తెలిపారు. అంతకుముందు చంద్రశేఖర్ బీజేపీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. 30 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల మేలు కోసం, వారి అభీష్టం మేరకే రాజకీయాల్లో ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు.
’12 మందితో హస్తం గూటికి’ అని చంద్రశేఖర్ భవిష్యత్ కార్యాచరణపై ‘రాష్ట్ర’ ముందే కథనం ఇచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది. తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 12 సంవత్సరాలు పని చేసి ఆ క్రమంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన తన లేఖలో అన్నారు. రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు, రైతుల పొలాలకు నీళ్లు వస్తాయని భావిస్తే అది కలగానే మిగిలిపోయిందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నివారించి తెలంగాణకు న్యాయం చేస్తుందని భావించి అనేకమంది ఉద్యమ నాయకులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ బీజేపీ సర్కార్ అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజా కంటకంగా మారిందని ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని, మూడు సంవత్సరాల పాటు నాకు సహకరించి నాతో బాటు పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీకి పని చేసే నాయకులను ప్రోత్సహించకపోవడం శోచనీయమన్న ఆయన.. కేంద్రం తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను నిలువరించలేకపోతోందని అన్నారు. ఈమధ్య సైలెంట్ గా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు చంద్రశేఖర్. ఈ విషయాన్ని వివరిస్తూ.. 12 మందితో హస్తం గూటికి చంద్రశేఖర్ అని, ‘రాష్ట్ర’ ఎక్స్ క్లూజివ్ గా వార్త ప్రచురించింది.