తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయాలు బీఆర్ఎస్ శ్రేణుల ఊహలకు అందకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చోటు చేసుకొంటున్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు చేరుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో ఆయన భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం బయటకు పొక్కుతోందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదీగాక సీఎం ఆఫీస్ నుంచి కొన్ని రోజులుగా ముఖ్య సమాచారం లీక్ అవుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఉన్న కొంత మంది అధికారులలో కేసీఆర్ (KCR) కోవర్టులు ఉన్నారని భావిస్తున్నట్లు తెలిసింది.
సీఎం కు సంబంధించిన చిన్న విషయం సైతం కేసీఆర్ కు చేరవేరుస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్నటి భేటీలో రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) నేతలతో భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం సెక్యూరిటీలో మార్పులు చోటు చేసుకొన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేశారా?.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రికి సంబంధించిన కాన్ఫిడెన్సియల్ మ్యాటర్స్, మూవ్ మెంట్ బయటకు పొక్కుతున్నట్లు సమాచారం అందటంతో ఈ మార్పులకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి మారిన సందర్భంలో సీఎం సెక్యూరిటీ మార్చివేస్తారు. ఈ క్రమంలో కొందరిని మార్చివేసినప్పటికీ కొంత మంది సెక్యూరిటీ అధికారులు మాత్రం పాతవారే ఉన్నారు.