లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను ఆకట్టుకొనే పనిలోపడింది. ఈ క్రమంలో సభలతో, సమావేశాలతో నేతలంతా బిజీ బిజీగా ఉంటున్నారు.. కాగా తాజాగా మెదక్ (Medak) కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు..1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు ఇక్కడి పార్లమెంట్ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో ఉందని గుర్తు చేశారు..
నాటి నుంచి నేటి వరకి బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఈ ప్రాంతానికి చేసిందేం లేదన్నారు.గత పదేళ్ల పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదని విమర్శించారు.. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిపారు.. కేసీఆర్ (KCR) పని అయిపోయింది.. కారు కార్ఖానాకు పోయింది.. ఇక దాన్ని తుక్కు కింద అమ్మాల్సిందేనని రేవంత్ ఎద్దేవా చేశారు.
పదేళ్లు మోడీ ప్రధానిగా.. కేసీఆర్ సీఎం గా ఉన్నారు.. వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని.. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి అని రేవంత్ వ్యంగ్యస్త్రాలు వదిలారు.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు అంటూ హెచ్చరించారు..
మీరు ఏం చేసిన చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా ఆడబిడ్డలకి రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంటే.. చూసి ఓర్వలేక కేసీఆర్, మోడీ కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ.. వచ్చే పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని రేవంత్ పేర్కొన్నారు..