– బీఆర్ఎస్, బీజేపీది డ్రామా
– మోడీ సభకు సహకరించిన కేసీఆర్
– కాంగ్రెస్ బలంగా ఉన్నచోట మోడీ సభ ఏంటి?
– డిపాజిట్లు రాని రాష్ట్రానికి పదేపదే పీఎం రావడమేంటి?
– బీఆర్ఎస్ ను గెలిపించడమే బీజేపీ లక్ష్యం
– ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరు
– బీజేపీ, బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు మోడీ (Modi) తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth). బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ (BJP) పన్నాగం పన్నిందని.. అందుకే, కాంగ్రెస్ (Congress) బలంగా ఉన్న చోట మోడీతో సభలు పెట్టిస్తోందని విమర్శించారు. మోడీ కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధానమంత్రా అని ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న ఆయనను ఇక్కడికి తీసుకురావడం ప్రజలను అవమాన పరచడమేనని మండిపడ్డారు.
వాళ్లకు వాళ్లు భజన చేసుకోవడానికే బీజేపీ సభ పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు రేవంత్. మోడీ వచ్చి వరాలు ఇస్తాడని ఆశిస్తే.. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ప్రకటన చేసి వెళ్లిపోయారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు కొత్త అంశాలేమీ కాదన్నారు. మోడీ పర్యటనకు పరోక్షంగా కేసీఆర్ సర్కార్ సహకరించిందని.. మిషన్ భగీరథ, కాళేశ్వరం అవినీతి, సింగరేణి దోపిడీ, లిక్కర్ స్కామ్ గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అదీగాక, అవినీతిపై చర్యలు తీసుకుంటామని మోడీ ఎందుకు అనలేదని ప్రశ్నించారు.
కుటుంబ పాలన గురించి మాట్లాడిన మోడీ.. కుటుంబ దోపిడీ గురించి మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తున్నారని అంటారని.. కానీ చర్యలు మాత్రం ఎందుకు తీసుకోరని నిలదీశారు. కేసీఆర్ దోపిడీలో మోడీకి వాటా ఉందని.. డిపాజిట్లు కూడా రాని రాష్ట్రానికి పదేపదే రావడం ఏంటని ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ వచ్చిన మోడీ కనీసం ప్రమోద్ మహాజన్ ను గుర్తు చేయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తారని.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై మాట్లాడతారని అనుకున్నామని చెప్పారు. కనీసం వాటి ప్రస్తావన లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదన్న రేవంత్.. రాష్ట్రంలో 19శాతం ఓట్లు అన్ డిసైడ్ లో ఉన్నాయన్నారు. ఇందులో మెజారిటీ ఓటు షేర్ తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు.. బిల్లా, రంగా లాంటి వారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరిద్దరూ కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తున్నారని.. దేశంలో ఎక్కడా లేని పథకాలను కాంగ్రెస్ గత హాయాంలో అమలు చేసిందన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన హామీలు.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో చర్చకు రావాలని హరీష్, కేటీఆర్ కు సవాల్ చేశారు.
కాంగ్రెస్ లో బహు సీఎంలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ బహు నాయకత్వం ఉంటే తప్పేందని ప్రశ్నించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో ఐదేళ్లు ఒక్కరే సీఎంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. భయంతో ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం రేషన్, రైతులకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ పనైపోయింది.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. ఇక టిక్కెట్ల ప్రకటన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుందని తెలిపారు. ఆ ప్రకటన నాటికి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరికలు ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వస్తున్నారంటేనే తమ బలం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.