ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) లక్ష్యమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ప్రధాని మోడీ (PM Modi) విమర్శలు, బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని.. నిజామాబాద్ లో సాక్షాత్తు మోడీనే ఈ బంధాన్ని బయటపెట్టారని అన్నారు. మోడీ, కేసీఆర్ (KCR) మధ్య పొత్తు బయటపడ్డాక ఎంఐఎం విధానమేంటో చెప్పాలని అడిగారు. తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్ఎస్ అని విమర్శించారు.
మిత్రుడు కేసీఆర్ తో జరిగిన చర్చలు బయట పెట్టిన మోడీ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ను అరెస్ట్ చేయొద్దు అని కూడా చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. కిషన్ రెడ్డి నియామకం కూడా కేసీఆర్ కోరిక మేరకే జరిగిందని చెప్పి ఉంటే బాగుండేదని సెటైర్లు వేశారు. అవినీతి పరుల భరతం పడతా అనే మోడీ.. కేసీఆర్ మీద ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అవినీతి చేశారు అని చెప్పిన మోడీ.. కేసీఆర్ మీద విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని అడిగారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఖాయమని.. ఈ విషయాన్ని ఓ ఎంపీ తనకు చెప్పారన్నారు. సీట్ల పంపకాలు కూడా జరిగాయని చెప్పారు. బీఆర్ఎస్ 9 సీట్లు.. బీజేపీ 7 సీట్లలో పోటీ చేస్తుందన్నారు. మిగిలిన మరో స్థానంలో ఎంఐఎం పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో మైనార్టీలు ఆలోచన చేయాలన్న రేవంత్.. బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలని విమర్శించారు. ఒకే నాణెంకి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని అన్నారు.
బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోడీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని ఆరోపించారు రేవంత్. బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ మద్దతుగా ఉందని.. కీలక బిల్లుల ఆమోదంలో అండగా నిలబడిందని గుర్తు చేశారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో విపక్ష సీఎంలపై ఈడీ దాడులు జరిగాయని.. మరి కేసీఆర్ పై ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు కేసులో తాను అరెస్ట్ ఖాయమన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించారు రేవంత్. రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉందన్న ఆయన.. ఇన్నాళ్లుగా ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు త్వరలో జైలుకెళ్తారనే చర్చ జరుగుతోందని.. ప్రజల దృష్టిని మరల్చడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.