బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బొందలగడ్డ తెలంగాణగా మార్చారంటూ కేసీఆర్ (KCR) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ఫైర్ అయ్యారు. మాట్లాడిన ప్రతిసారీ తెలంగాణ నెంబర్ 1 అని చెప్తున్నాడన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ 1 అని అన్నారు. నిరుద్యోగ సమస్యల్లో రాష్ట్రం నెంబర్ వన్ అని తీవ్రంగా ధ్వజమెత్తారు.
నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చీమలు బారులు తీరినట్లుగా వేలాది మంది ఈ సభకు తరలి వచ్చారన్నారు. మీ అందరికి అభినందనలు అని తెలిపారు. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయారని, కానీ పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మక ద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చిందన్నారు.
దేశంలోనే తెలంగాణను నంబర్ 1 తాగుబోతుల అడ్డాగా మార్చారని మండిపడ్డారు. అమ్ముడు పోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వద్దని పిలుపు నిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యమని కేసీఆర్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యం అంటే లాంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యమన్నారు.
నర్సాపూర్ అనేది లాంబాడి సోదరుల అడ్డా అని అన్నారు. నర్సాపూర్‌ను చార్మినార్ జోన్లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. లంబాడీల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే లంబాడీ తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత తమ పార్టీదన్నారు.
తండాల్లో మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమన్నారు. భూమి ఆత్మగౌరవం, 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమన్నారు. దళితులను ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యమని వెల్లడించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమన్నారు. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించింది ఇందిరమ్మ రాజ్యమేనన్నారు. ఇందిరమ్మ రాజ్యమే లేకపోతే, సోనియ గాంధీ తెలంగాణ ఇచ్చి ఉండకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేదన్నారు. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్‌గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమేనన్నారు. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా? అని మండిపడ్డారు.