తెలంగాణలో ఎన్నికలకు సిద్ధిమౌతున్నాయి పార్టీలు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ (Congress) పార్టీ దరఖాస్తుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోటీకి ఆసక్తి ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆహ్వానం పలికింది. అయితే.. కండిషన్స్ అప్లై అని స్పష్టం చేసింది. శుక్రవారం గాంధీ భవన్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం అప్లికేషన్స్ విడుదల చేసింది కాంగ్రెస్.
అప్లికేషన్ విడుదల సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. టికెట్ల పంపిణీపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఎలక్షన్ అండ్ స్క్రీనింగ్ కమిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయని తెలిపారు. పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తారని వెల్లడించారు.
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించాకే అభ్యర్థులను ఫైనల్ చేస్తామని చెప్పారు రేవంత్. అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా ప్రకటించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25 వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించామని తెలిపారు. ఈ రుసుమును తిరిగి చెల్లించమని.. ఆ డబ్బును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు.
దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25 వరకు ఉంటుందని అన్నారు రేవంత్. ఇక అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని.. అవన్నీ ఊహాగానాలేనని తెలిపారు. ఎవరైనాసరే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.