కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Tpcc chief Revanth Reddy) అన్నారు. హైదరాబాద్(HYD)లో ఆదివారం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్(Meet The Press) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అసంబద్ధ హామీలను నమ్మవద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి భయపడుతున్నారని రేవంత్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని, వచ్చే ఎన్నికల్లో 110 స్థానాల్లో పార్టీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ దేశంలోని పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అందులో ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని అన్నారు.
బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని చెబుతోన్న బీజేపీ.. బీసీ కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీసీ కుల గణననే చేయలేని బీజేపీ.. బీసీని సీఎం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ హామీని ఎన్నికల తర్వాత ఆ పార్టీ పట్టించుకోదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెబుతోందని.. కానీ రాష్ట్రంలో రైతులకు కేవలం 8 నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. ధరణి పోర్టల్‌తో కేసీఆర్ కుటుంబం లక్షన్నర ఎకరాలను దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని రేవంత్ తెలిపారు. నిజాం నిరంకుశ పాలన, సమైక్య పాలకుల ఆధిపత్యం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసం.. అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని గుర్తుచేశారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని రేవంత్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని విమర్శించారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రేవంత్ అభిప్రాయపడ్డారు.