దేశంలో 2024 పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలివిడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఆస్తుల విలువ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వారి ఆస్తి వేల కోట్లలో ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలవడం విశేషం. ఎన్నికల అధికారులకు అందించిన అఫిడవిట్ ద్వారా వారే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. వీరిలో గుంటూరు టీడీపీ అభ్యర్థి(Gunturu TDP Candidate) పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Shekar) రూ. 5,598.65 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు.
రెండో స్థానంలో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.4,568కోట్లతో రెండో స్థానంలో, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ.715.62కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ కడప అభ్యర్థి వైఎస్ షర్మిల రూ.182కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
కాగా ఈ రోజు మరికొందరు కీలక నేతలు నామినేషన్లు వేయనుండగా వారిలో ఎవరి ఆస్తులు ఎక్కువ ఉన్నాయో తేలనుంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మొదటి దశలో 102 స్థానాలకు పోలింగ్ జరగ్గా ఈ నెల 26వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.