కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఓ షెఫ్ గా మారిపోయారు. తన కుమార్తె నుంచి కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాని మోడీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ దోషి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సందర్భంలో.. ఆయనకు లాలూ ప్రసాద్.. ప్రత్యేక విందునిచ్చారు. తానే షెఫ్ గా మారి.. బీహార్ నుంచి తెప్పించిన చంపారన్ మటన్ వండి ఆయనకు డిన్నర్ ఇచ్చారు.
పరువు నష్టం కేసులో రాహుల్ కి ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ హ్యాపీ అకేషన్ ను పురస్కరించుకుని లాలూ ప్రసాద్… రాహుల్ కి మొదట పుష్పగుచ్ఛమిచ్చి హగ్ చేసుకున్నారు. ఆ తరువాత విందు సమయంలో ఇద్దరూ కొద్దిసేపు తాజా రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ విందులో బీహార్ డిప్యూటీ సీఎం, తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు.
రాహుల్ వెంట కాంగ్రెస్ నేత కె.సి. వేణుగోపాల్ కూడా ఉన్నారు. లాలూ ఆరోగ్యం గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరగనున్న విపక్ష కూటమి ‘ఇండియా’ సభ్యుల సమావేశం దృష్ట్యా, వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ ఎప్పుడు పునరుద్ధరిస్తుందో, లోక్ సభ స్పీకర్ ఆయన సభ్యత్వాన్ని ఎప్పుడు పునరుద్ధరించి తిరిగి పార్లమెంటుకు ఆహ్వానిస్తారో వేచి చూడాల్సి ఉంది.
అలాగే ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో జరిగే చర్చలో రాహుల్ పాల్గొంటారా అన్నది కూడా తేలవలసి ఉంది. ఈ తీర్మానంపై ఈ నెల 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉంది. 10 న చర్చకు మోడీ సమాధానమిస్తారు.