భారత జట్టులో కెప్టెన్సీ పాత్రపై రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం, వారి పట్ల నమ్మకం ప్రదర్శించడం చాలా ముఖ్యమని తెలిపాడు. ముంబై(Mumbai) వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. జట్టుకు నాయకత్వం వహించడం ఎప్పుడూ కత్తిమీద సామేనని బయట నుంచి చూసేవారికి చాలా ఈజీగా అనిపిస్తుందని తెలిపాడు.
‘కెప్టెన్ ఒక ఆలోచనా విధానంతో వస్తాడు. అభిమానులు మాత్రం తాము అనుకున్నదే సారథి చేయాలని కోరుకుంటారు. జట్టుగా ఆడాల్సిన గేమ్ క్రికెట్. టీమ్‌కి ప్రతీ ఒక్కరి సహకారం ఉండాలి. ప్లేయర్లకు స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. “ఓపెనర్‌గా ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా జట్టు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తా.’ అని రోహిత్ పేర్కొన్నాడు.
‘సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా. ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఎప్పుడూ కష్టమే. ఎలాంటి పిచ్ ఉంటుందో తెలియదు. ప్రతీ మ్యాచ్‌కు ముందు తీవ్రంగా శ్రమిస్తా. తొలి ఓవర్‌లోనే ఒక షాట్ కొట్టాలని భావిస్తే దానిని ముందే ప్రాక్టీస్ చేసి వస్తా. ఒక్కసారి అలాంటి షాట్ ఆడితే ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది.’ అని రోహిత్ రాసుకొచ్చాడు.
‘టీమ్ గెలవాలంటే ప్లేయర్స్‌లో ఆత్మవిశ్వాసం నింపాలి. ప్రతీ ఆటగాడితో నేను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటా. ఒకవేళ ఎవరినైనా మేనేజ్‌మెంట్ తప్పించాలనే ఆలోచన చేస్తే అప్పుడు కెప్టెన్‌గా నేను కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి ఆటగాళ్లతో చర్చించి ఆత్మవిశ్వాసం కలిగేలా చూడాలి. ఇప్పటి వరకూ నేను చేసిందదే.’ అని రోహిత్ తెలిపాడు.