తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారాలు ఏకధాటిగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS) ప్రచారంలో దూసుకు పోతుండగా బీజేపీ (BJP) కూడా అదే దారిలో సాగుతుంది. మరోవైపు బీఎస్పీ (BSP) అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) కూడా ఎలాంటి హంగామా లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతిని తీవ్రస్థాయిలో ఎండగడుతున్న ప్రవీణ్ కుమార్.. తాజాగా పెద్దపల్లి (Peddapalli)నియోజకవర్గంలో.. బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనను తరిమికొట్టేందుకు.. ప్రజలంతా ఏకం అవ్వాలని పిలునిచ్చారు. అవినీతి అంతం కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఈ 9 ఏళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయాడని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్ష కోట్లు అప్పు చేసిన కేసీఆర్ రాష్ట్రంలో దర్జాగా బ్రతుకుతున్నాడని.. నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు.. మరోవైపు పెద్దపల్లి జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు నాయకులు బీఎస్పీ కండువా కప్పుకున్నారు.