– అన్నపూర్ణ స్టూడియో దగ్గర రెచ్చిపోయిన ఫ్యాన్స్
– ఆర్టీసీ బస్సులపై దాడి
– 6 బస్సుల అద్దాలు ధ్వంసం
– జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్
– అభిమానులపై సజ్జనార్ సీరియస్
పాశ్చాత్య మూసలో భారతీయ టెలివిజన్ రంగంలో రూపుదిద్దుకున్నది బిగ్ బాస్ (Bigg Boss). దీనివల్ల సదరు ఛానల్ కు హోస్ట్ అండ్ కంటిస్టెంట్లకు ఉపయోగమే తప్ప.. చూసే ప్రేక్షకుడికి పైసా ప్రయోజనం ఉండదు. కానీ, అభిమానం ముసుగులో కొందరు సైకోల్లా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ఫైనల్స్ రోజున అభిమానులు వ్యవహరించిన తీరును చూశాక సోషల్ మీడియాలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
అన్నపూర్ణ స్టూడియో దగ్గర నానా రచ్చ
ఫైనల్స్ లో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth), అమర దీప్ (Amar Deep) పోటీ పడ్డారు. టైటిల్ ప్రశాంత్ చేతికి దక్కింది. అయితే.. ఇద్దరి అభిమానులు వాళ్లిద్దరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఎప్పుడు బయటకు వస్తారా? అని బాగానే పోగయ్యారు. పోటాపోటీగా కేకలు వేశారు. విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నానా రచ్చ చేశారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
ఆర్టీసీ బస్సులపై దాడి.. సజ్జనార్ ఆగ్రహం
అభిమానం వెర్రితో ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ (RTC) బస్సులపైనా దాడికి పాల్పడ్డారు ఇరు వర్గాల ఫ్యాన్స్. హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించదు. ఆ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు.
అమర దీప్ కారు ధ్వంసం
మరోవైపు, స్టూడియో గేట్ దాటి అమర దీప్ కారు బయటకు రాగానే ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయారు. కారులో ఉన్న అమర దీప్ ని అతని భార్యని బూతులు తిడుతూ సైకోల మాదిరి బిహేవ్ చేశారు. అమర దీప్ ను కారు నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒకడైతే ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. దీంతో కారులో ఉన్న వాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. గొడవకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరసలు అభిమానులా? సైకోలా? అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
బిగ్ బాస్ వల్ల ఉపయోగమేంటి..?
నిజానికి.. బిగ్ బాస్ వల్ల దండగే కానీ.. ఉపయోగం లేదని కొందరి వాదన. సీపీఐ నారాయణ అయితే మొదట్నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదొక బూతు దందా.. బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ అంటూ పలుమార్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. అదో పనికిమాలిన షో అని, సమాజ విలువలను దిగజార్చే చెండాలమంతా బిగ్ బాస్ లోనే ఉంటుందని అన్నారు. ఈ షో వల్ల వల్ల సమాజానికి ఏం ఉపయోగం? మంచి వాళ్ళను చెడగొట్టడం తప్ప అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ సంఘాలు సైతం ఈ షో పై అభ్యంతరం చెబుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతిని దేశంలోకి తీసుకొచ్చి.. మన విలువలు, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని మండిపడుతున్నాయి.