మొన్నటి వరకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. తాజాగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. ఏ దేశం మీద ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్, చైనా నుంచి నిత్యం ముప్పు పొంచి ఉన్నదని భావించిన భారత్.. రక్షణ వ్యవస్థను పటిష్టంగా మార్చుకుంది.. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సమకూర్చుకుంటున్నది.
భారత్ సుమారుగా రూ.35 వేల కోట్లు వెచ్చించి ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు భారత్‌కు చేరగా మరో రెండింటి సరఫరా విషయంలో ఆలస్యం అవుతున్నది.
సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థ అండగా నిలుస్తుంది. 400 కిలోమీటర్ల దూరంలో నుంచి వస్తున్న శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలని సైతం ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించి నాశనం చేస్తుంది. అంతేగాక 36 లక్ష్యాలపై ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం ఎస్-400 మిస్సైల్ సొంతం.
ఇంతటి సామర్థ్యం గల మూడు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ స్క్వాడ్రన్లతో (S-400 air defence missile squadrons) భారత వాయుసేన (Air Force) చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ పైశాచిక ఆనందం పొందుతుండగా.. ఎప్పుడు భారత భూభాగాన్ని ఆక్రమించుకుందామా అని చైనా గోతికాడి నక్కలా ఎదురు చూస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉంది..