బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన కేసు కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి హర్యానా(Haryana)లో ఈ కేసుతో ముడిపడి ఉన్న మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న విక్కీ గుప్లా, కుమార్ పాలక్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా మూడో నిందితుడి ఆచూకీని కనుగొన్నారు. ఈ మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సదరు వ్యక్తి పేరును పోలీసులు వెల్లడించలేదు. ఆ వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, షూటర్స్ మధ్య మధ్యవర్తిగా పని చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
కాల్పులు జరిపేందుకు విక్కీ, పాలక్‌లకు రూ.4లక్షలు సుపారీ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారికి తొలుత బయానా రూ.లక్ష ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల వెనుక ఉద్దేశం కేవలం సల్మాన్ ఖాన్‌ను భయపెట్టడానికి మాత్రమే కానీ ఆయనను చంపడానికి కాదని మాత్రం నిందితులు పోలీసులు చెప్పినట్లు సమాచారం.
సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరపడానికి ముందు.. నిందితులు పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిందితులకు చెందిన ఇరు కుటుంబాల వాంగ్మూలాలు బిహార్‌లో నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా హర్యానా, ఇతర రాష్ట్రాల నుంచి ఏడుగురిని పిలిపించామని, ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోందని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు.