అన్నమయ్య (Annamayy) జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు (Sandalwood Smugglers) బరితెగించి దారుణానికి ఒడిగట్టారు.. ఎర్రచందనం దొంగిలిస్తూ అడ్డుకోబోయిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పట్టువదలకుండా పోలీసులు, స్మగ్లర్ల వెంటపడ్డారు. దీంతో కారును వదిలి ముగ్గురు పారిపోయారు. మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నారు.
తెల్లవారుజామున కేవీపల్లి (KV Palli) మండలం హుందేవారిపల్లి వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కారులో అటుగా వస్తున్న నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. దీంతో కారును ఆపి చెకింగ్ చేసేందుకు కానిస్టేబుల్ గణేశ్‌తో పాటు మిగిలిన పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ వారు కారు ఆపకుండా ముందుకు పోనిచ్చారు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకునేందుకు కారును వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు కారును ఆపకుండా కానిస్టేబుల్ గణేశ్‌ను ఢీ కొట్టి పారిపోయేందుకు యత్నించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గణేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ మృతితో పోలీసులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు చనిపోయిన కానిస్టేబుల్ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
స్మగ్లర్ల కారును సీజ్ చేసిన పోలీసులు కారులోని 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొన్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇక తరచుగా ఈ ప్రాంతంలో ఎర్రచందనం మాఫియా ఇలాంటి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.. స్మగ్లింగ్ కు అడ్డు వచ్చిన వారి ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడటం లేదని ఇదివరకు జరిగిన సంఘటనలు నిరూపించాయి..