అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం తీర్చడం ప్రతీ మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్నదానం.. కోటి గోవుల దాన ఫలితంతో సమానమని పెద్దలు చెప్తుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారు ఈ అన్నదానాన్ని ఒక పవిత్రమైన అర్పణగా భావిస్తారు. మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ గొప్ప సంస్కృతి కొనసాగుతోంది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో నిరుపేదల ఆకలి తీర్చే సంకల్పంతో ముందుకు వెళ్తోంది సంగెం చారిటబుల్ ట్రస్ట్ (Sangem Trust). ఈ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతోంది. ఈ ఆదివారం (Sunday)తో 125 వారాలు పూర్తయింది. ఎవరూ ఆకలితో ఉండకూడదనే మంచి లక్ష్యంతో సంగెం ట్రస్ట్ కృషి చేస్తోంది.
ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉపాధ్యాయులు భీమ అంబయ్య పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. పేదలకు సేవ చేస్తున్న సంగెం ట్రస్ట్ సభ్యుల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ఉత్తమ సేవా అవార్డును అందుకున్న సంగెం చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ పాల్గొన్నారు. అలాగే, మహేందర్ రెడ్డి, సలీమ్, శుభాష్, రాజయ్య, డిన్ను, లఖన్ సహా తదితరులు పాల్గొన్నారు.