ప్రపంచ కప్ (World Cup) పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సోషల్ మీడియా (Social Media) మొత్తం కికెట్ (Cricket) కు సంబంధించిన పోస్టులతో నిండి పోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా క్రికెట్ గురించి చర్చించుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో జరగబోయే ప్రపంచ కప్ కోసం తాను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు పాకిస్తాన్ అందాల భామ, క్రికెట్ ప్రజెంటేటర్ జైనాబ్ అబ్బాస్ అన్నారు.
ఇప్పుడు ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోందన్నారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య భిన్నాభిప్రాయాల కంటే అనేక సాంస్కృతిక సారూప్యతలను పంచుకోవడం తనకు ఆసక్తిని కలిగిస్తుందన్నారు. బిలియన్ మంది ప్రజలు ఉన్న దేశానికి ప్రాతినిధ్య వహిస్తూ, కంటెంట్ క్రియేట్ చేసేందుకు అతిథ్య భారత్ కు ప్రయాణమవుతున్నట్టు ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన పాత ట్వీట్స్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె గతంలో చేసిన హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక పోస్టులను రీ ట్వీట్ చేస్తున్నారు. భారత వ్యతిరేక వ్యాఖ్యలను గుర్తు చేస్తూ హిందూ సంఘాలు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇండియాపై ఆమె అసహనాన్ని ఆ ట్వీట్లు తెలియజేస్తున్నాయంటూ ఫైర్ అవుతున్నాయి.
గతంలో ఓ సందర్బంలో ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఒక్క ఫాస్ట్ బౌలర్ ను కూడా తయారు చేయలేక పోయిందని ఆమె అన్నారు. అందువల్ల కొంచెం మాంసాహారం తినండంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. ఈ ట్వీట్ పై అప్పట్లో దుమారం రేగింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.