పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగిపోయింది. అదేవిధంగా టికెట్ల కేటాయింపు అంశం అటు పార్టీలకూ తలనొప్పిగా మారింది.టికెట్ రాని వారు వెంటనే పక్కపార్టీలోకి జంప్ అవుతున్నారు. మరికొందరు అధిష్టానం మీద గుస్స అవడం, రెబల్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదంతా రెగ్యులర్ పాలిటిక్స్‌లో కామన్.
కానీ, ఓ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈరోడ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ గణేశమూర్తికి(MP GANESHA MURTHI) ఎండీఎంకే(MDMK) పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కేటాయించలేదు.
దీంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యా యత్నం(SUICIDE) చేశాడు.వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను కోయంబత్తూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గత ఆదివారం ఉదయం పురుగుల మందు తాగగా అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలోనే తెల్లవారుజామున హార్ట్స్ట్రోక్ (HEART ATTACK) రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మృతి చెందాడని తెలుసుకుని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఈరోడ్ నుంచి 2019 ఎంపీ ఎన్నికల్లో గణేశమూర్తి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాగా, టికెట్ రాలేదని ఓ సిట్టింగ్ ఎంపీ ఇలా సూసైడ్ చేసుకోవడం దేశంలో ఇదే తొలిసారి అని చర్చ జరుగుతోంది.