రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీఆర్ఎస్ (BRS)కి సొంత పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు.. చిన్న బాస్ ఎంతలా ప్రయత్నిస్తున్నప్పటికి కారు దిగుతున్న నేతలు రోజు రోజుకు పెరిగిపోవడం కనిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడగా, జహీరాబాద్ (Zaheerabad) ఎంపీ బీబీ పాటిల్ (MP BB Patil) సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. నేడు ఢిల్లీలో బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. అనంతరం మాట్లాడిన బీబీ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మోడీ (Modi) పదేళ్ల ప్రగతిని చూసి బీజేపీ (BJP)లో చేరినట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోరుకునేవారు బీజేపీలో చేరుతున్నారని తెలిపిన ఆయన.. బీఆర్ఎస్ మనుగడ ఇక కష్టం అని పేర్కొన్నారు..
పార్టీలో చివరికి తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.. బంగారు తెలంగాణ (Telangana) కావాలనుకునే వారు బీజేపీలో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) అసత్య హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే.. వ్యతిరేకత మొదలైందని తెలిపారు. మరోవైపు తరుణ్ చుగ్ సైతం బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు..
బీఆర్ఎస్ పార్టీ పేరును BBB (బాప్, బేటా, భేటీ) గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Laxman) ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని, గడిచిన చరిత్ర అని దుయ్యబట్టారు. తెలంగాణలో దళిత, లింగాయత్ నాయకులు బీజేపీలో చేరారని, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఓర్చుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.