-ఒకరి మృతి
-40 మందికి తీవ్రగాయాలు
-ఘటనా స్థలానికి చేరుకున్న డీజీపీ
-సీఎం పినరయికి అమిత్ షా ఫోన్
-ఎన్ఎస్జీ, ఎన్ఐఏలను పంపుతున్న కేంద్రం
-ఐఏఈడీనే కారణమని ప్రాథమికంగా అంచనా
-బాధ్యులను వదలబోమన్న సీఎం
-కఠినంగా శిక్షిస్తామని స్పష్టం
కేరళ(Kerala) లో వరుస పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎర్నాకుళం (Ernakulam) జిల్లా కాలామస్సెరిలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిమిషాల వ్యవధిలో మూడు సార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాలామస్సెరి నెస్ట్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం క్రైస్తవ మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలకు వరపుజ, అంగమలి, ఎడపల్లి తదితర మండలాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవ మతస్తులు తరలి వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని స్థానికులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.
షాక్ నుంచి తేరుకునేలోపే ఐదు నిమిషాల్లో మూడు సార్లు పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో టిఫిన్ బాక్సులో పేలుడు పదార్థాలు దొరికినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే యాంటీ టెర్రర్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో దర్యాప్తు జరుపుతున్నాయి. ఇక ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఇది ఇలా వుంటే కన్వెన్షన్ సెంటర్లో పేలుళ్లకు ఐఈడీనే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్టు డీజీపీ డా.షేక్ దర్వేశ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే కేరళ సీఎం పినరయి విజయన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి విజయ్ ను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఘటన కోసం జాతీయ దర్యాప్తు బృందం(NIA),నేషనల్ సెక్యూరిటీ గార్డు(NSG)లను పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ స్పందించారు. కొచ్చిలో కాలామస్సెరి నెస్ట్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో బాంబు పేలుడు ఘటన దిగ్బ్రాంతికరమని చెప్పారు. ఇప్పటికే ఘటనపై హోం మంత్రి అమిత్ షా.. కేరళ సీఎంతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయన్నారు.