బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్రజాజీవితంలోకి అడుగుపెడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన షకీబుల్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
ప్రధాని షేక్ హసీనా(Sheikhe Hasina)కు చెందిన అవామీ లీగ్(Awami League) తరఫున ఈ ఆల్‌రౌండర్ ఎన్నికల బరిలోకి దిగాడు. మగుర 1(Magura 1) నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో సమీప ప్రత్యర్థి రెజౌల్ హసన్(Rezaul Hasan)ను చిత్తుచేశాడు.
షకీబ్‌కు 1,85,388 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హసన్‌కు కేవలం 45,933 ఓట్లు మాత్రమే పడ్డాయి. దాంతో, ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్‌గా ఎంపీగా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ముష్రఫే ముర్తాజా(Musharfe Mortaza) ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
19ఏళ్ల వయసులోనే ప్రీమియర్ స్పోర్ట్స్ అకాడమిలో చేరిన షకీబ్ 2006లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే ప్రపంచంలోని ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఆల్‌రౌండర్‌గా షకీబ్ గుర్తింపు సాధించాడు.
షకీబ్ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించగానే.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై చప్తాడని అంతా అనుకున్నారు. అయితే షకీబ్ ప్రచార సభల్లో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను రిటైర్ అవ్వాలా? ‘అంటూ అభిమానులను అడిగారు. అనంతరం.. ‘నేను ఇంకా క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారు’ అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ఇక, షకీబ్ ఎంపీగా గెలుపొందడంతో ఆయన ఫ్యాన్స్ సంబురాల్లో మునిగితేలారు.