వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తీసిన ‘వ్యాక్సిన్ వార్’ (Vaccine War) చిత్రంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇది పబ్లిసిటి కోసం చేస్తున్న చౌకబారు ప్రయత్నాలుగా ఆయన అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలపై న్యాయ సలహా తీసుకుంటానని వెల్లడించారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే దాన్ని నిజమని జనాలు నమ్మే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి శశథరూర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…. తాము వ్యాక్సిన్ వార్ ప్రమోషన్ కోసం వచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విదేశీ వ్యాక్సిన్ ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు.
ఒక వేళ రైట్ వింగ్ వ్యక్తులు డబ్బుల కోసం జవాన్ సినిమాను ప్రమోట్ చేస్తే అది సమస్య కాదన్నారు. దాని వల్ల ఆ వ్యక్తులకు కేవలం కొంత డబ్బు మాత్రమే వస్తుందన్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, విరాట్ కోహ్లీ లాంటి ఇతర సెలబ్రిటీలు తాము వాడని వస్తువులను కూడా ప్రమోట్ చేస్తారన్నారు. అది ఒక రకమైన వ్యాపారమన్నారు.
కానీ రాజ్యాంగ బద్దమైన పదవుల్లో వున్న వాళ్లు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం చేయడానికి డబ్బు తీసుకోవడం చాలా ఆందోళనకరమన్నారు. సీఎం కేజ్రీవాల్, శశిథరూర్ లపై తాను కేవలం ఆరోపణలు చేయడం లేదన్నారు. తాను వాస్తవాలను మాత్రమే చెబుతున్నానన్నారు. సినిమాలో అన్ని విషయాలను చూపించామన్నారు. ఇండియన్ వెర్షన్‌లో కొన్ని విషయాలు అస్పష్టంగా ఉన్నాయనని కాబట్టి వాటిని చూపించలేదన్నారు, కానీ విదేశాల్లో విడుదలైన వెర్షన్‌లో అది స్పష్టంగా వుందన్నారు.