తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ముగిసిన కొద్దిరోజుల్లోనే మరో ఎన్నికల సైరన్ మోగింది. సింగరేణిలో ఈనెల 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు(Singareni Elections) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేశారు.
సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సంబంధించి గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే, అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో సింగరేణి ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ (సీఎల్‌సీ) డి.శ్రీనివాసులు సోమవారం సింగరేణిలోని 13 కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మూడు నెలల క్రితం హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం డిసెంబరు 27న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. తాజా ఓటర్ల జాబితాను కార్మిక నేతలకు అందజేసిన ఆయన.. మొత్తం 39,748 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్టోబరు 30 నుంచి సింగరేణి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.