ప్రస్తుత రోజుల్లో చిన్న సమస్యలు ఎదురైనా తట్టుకోలేక పోతున్నారు. దానికి పరిష్కారం వెతకకుండా ఆత్మహత్య (Suicide)లకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకొంది.. భార్య విడాకులు ఇవ్వట్లేదని ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సిరిసిల్ల (Sircilla), బోయినపల్లి (Boinapally) మండలం రామన్నపేటకు చెందిన కళాధర్ అనే వ్యక్తికి గత కొంత కాలంగా భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడాకులు ఇవ్వాలని పలుమార్లు భార్యను కోరాడు.
కానీ అతనికి డివోర్స్ (Divorce) ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఈ వివాదం ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కళాధర్ ఆదివారం గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
మరోవైపు భార్య విడాకులు ఇవ్వకపోతే ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఏంటి అంటూ కళాధర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. చావు సమస్యకు పరిష్కారం కాదని, చట్టం ద్వారా అయిన సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉందని హితవు చెబుతున్నారు.