హెచ్ఎండీఏ (Hmda)) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Siva Balakrishna) కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఆయన కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి పేరు సైతం బయటకు వచ్చింది. బాలకృష్ణ అరెస్టైనప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేసిన అధికారులు, ఇతరులపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇప్పుడు ఆ కోణంలోనే తీగ లాగుతోన్న అధికారులకు అరవింద్ కుమార్ హస్తం ఉన్నట్లు గుర్తించింది.
బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ (ACB).. 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించింది. కాగా ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం.. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ (Senior IAS Officer) అరవింద్ కుమార్ పాత్రపైన ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అతడిని విచారించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
మరోవైపు బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్ టాప్‌లు మార్చినట్లు గుర్తించిన ఏసీబీ.. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో పేర్కొంది. ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ.. ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుంచి 31 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా రెరా సెక్రటరీ అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు రావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరగా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. కాగా ఈ కేసులో ఈడీతోపాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. పెద్దమొత్తంలో నగదు చేతులుమారడంతో మనీలాండరింగ్ కోణంలో శివబాలకృష్ణను విచారించే అవకాశం ఉంది. అటు బినామీ ఆస్తులపై ఇప్పటికే ఐటీ అధికారులు విచారణ చేపట్టారు.