పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా వ్యవస్థను పటిష్టం చేశాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మావోయిస్టు(Maoists)ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అధికారులు, భద్రతా బలగాలు సెక్యూరిటీని పెంచాయి.
వివాదాస్పద పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కేంద్ర భద్రతా బలగాలు(Central security Forces) నిరంతరం నిఘాను కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బమరక అటవీ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో భాగంగా పోలీసులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు భారీ పన్నాగం పన్నారు. ఆ కుట్రను పోలీసులు ఛేదించారు.
ఆరుగురు మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతి పరులను అరెస్టు చేశారు. అంతేకాకుండా భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 19 బీజీఎల్ బాంబులు, 5కిలోలో పేలుడు పదార్థాల డంప్, 4 మందు పాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 25 మంది వరకు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.