కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi), ఆ పార్టీ జనరల్ సెక్రటరీ (General Secretary) ప్రియాంక గాంధీ చెన్నైకి చేరుకున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్( Womens Rights Conferance) నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇద్దరు నేతలుే చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీకి సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఆర్ బాలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి సీఎం స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేయనున్నారు. ఈ సభ కోసం నందనం గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా పరిశీలించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా నాయకులతో పాటు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తి, విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నాయకులను కనిమోళి ఆహ్వానించారు.
ఇతర రంగాల మహిళా ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదేండ్ల తర్వాత సోనియా గాంధీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. అంతకు ముందు 2018లో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చెన్నైకి వచ్చారు.