ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2024లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunraisers Hyderabad) వర్సెస్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ పంజాబ్‌తో ఆడిన హైదరాబాద్ అందులో స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, హోంగ్రౌండ్లో నేడు మ్యాచ్ ఆడుతున్నందున ఎలాగైన ఈ మ్యాచ్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నేటి మ్యాచుకు ఎస్ఆర్హెచ్ జట్టు అభిమానులు భారీగా ఉప్పల్(Uppal) స్టేడియానికి తరలిరానున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియం వెళ్లేవారికి రాచకొండ సీపీ తరుణ్ జోషి కీలక ఆదేశాలు జారీచేశారు.
స్టేడియం లోపలికి ల్యాప్ టాప్స్, వాటర్, సీసాలు, బ్యానర్లు, లైటర్లు, సిగరేట్లు, ప్లాస్టిక్ ఐటమ్స్, వేస్టేజీ వస్తువులను తీసుకురాకుడదని ముందస్తుగా సూచించారు.ఎవరైనా తీసుకొస్తే వారిని స్టేడియం వెలుపలే ఆపేస్తామన్నారు.
మ్యాచ్ ప్రారంభానికి 3 గంటల ముందే లోనికి అనుమతిస్తామని అన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. అలాగే స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.మ్యాచ్ పూర్తయ్యే వరకు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.