తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ (Sri Ramakrishna) కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మొత్తం 300కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పనిచేసారు.
వాటిలో బొంబాయి, జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. శ్రీరామకృష్ణ వయో సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఇటీవల రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు ఆయన చివరిసారిగా మాటలు రాశారు. రామకృష్ణ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రామకృష్ణ ఏపీలోని తెనాలిలో జన్మించారు. ఆయన 50 సంవత్సరాల కిందటే చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. అనువాద రచయితగానే కాకుండా బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ లాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, శంకర్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసేవారు.
గాయకుడు మనోను రజనీకాంత్‌కు పరిచయం చేసింది ఆయనే. ప్రస్తుతం సూపర్ స్టార్ సినిమాలకు మనో తెలుగు డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే. శ్రీరామకృష్ణ మృతితో మనో దిగ్బ్రాంతికి లోనయ్యారు. మంగళవారం ఉదయం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని శ్రీరామకృష్ణ కుమారుడు గౌతం తెలిపారు.