తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలో శ్రీశైలం ప్రముఖ శైవక్షేత్రం కావటంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో జంట నగరాల నుంచి శ్రీశైలానికి వెళ్ళే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
హైదరాబాద్ (Hyderabad) నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడనున్నట్లు రంగారెడ్డి (Rangareddy) రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. నగరంలోని బీహెచ్‌ఈఎల్ (BHEL), జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ (MGBS) నుంచి శ్రీశైలంకు బస్సులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సును నడుపుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం నుంచి ఉదయం 5 గంటల సమయంలో మొదలై హైదరాబాద్‌కు బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు.
ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు బస్సులు నగరం నుంచి బయల్దేరతాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీ, ఆర్డీనరీ, సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు అధికార్లు తెలిపారు. ఏసీ బస్సు సర్వీసుల్లో పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.510 ఛార్జీలుగా నిర్ణయించామని రంగారెడ్డి రిజియన్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు.