ఏఐయూడీఎఫ్ (AIUDF)అధ్యక్షుడు, బద్రుద్దీన్ అజ్మల్ ( Badruddin Ajmal)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో జనవరి 20 నుంచి 26 వరకు ముస్లింలంతా ఇళ్లలోనే ఉండాలని అన్నారు. ఆ సమయంలో రైలు ప్రయాణాలను మానుకోవాలని ముస్లింలకు ఆయన పిలుపు నిచ్చారు.
బీజేపీ అనేది ముస్లింలందరికీ శత్రువు అంటూ రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. బీజేపీ ముస్లిం ప్రజలను ద్వేషించడం లేదని తెలిపారు. తాము ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’అనే మంత్రంతో పని చేస్తున్నామని వివరించారు.
అయోధ్య భూ వివాదంలో కోర్టు కేసు వేసిన ఇక్బాల్ అన్సారీని కూడా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించామని తెలిపారు. ఆయన కూడా ప్రార్థనల్లో పాల్గొంటారని చెప్పారు. బద్రుద్దీన్ అజ్మల్, ఓవైసీ లాంటి వాళ్లు ఈ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అయోధ్యలో ‘రామ్ లల్లా’విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, ఇతర రాజకీయ నాయకులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీతో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.