ట్విట్టర్(Twitter)లో లేఆఫ్లతో ప్రారంభమైన తీసివేతల పర్వం.. ఇప్పుడు ప్రముఖ టెక్ కంపెనీలకు పాకింది. దీంతో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడినట్లైయింది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు అనేక కంపెనీలు వారి కంపెనీల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తాజాగా ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ కంపెనీ(Stellantis Company) ఆ జాబితాలో చేరింది. ఒకేఒక్క ఫోన్ కాల్తో 400మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది ఈ టెక్ కంపెనీ. అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ భాగాల్లోని పని చేస్తున్న ఈ 400 మందికి సదరు సంస్థ మార్చి 22వ తేదీన రిమోట్ కాల్ చేసి లేఆఫ్ ప్రకటించింది.
ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఫార్చ్యూన్ మేగజైన్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది. స్టెల్లాంటిస్ కంపెనీకి భారత్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తుండగా.. వారు తక్కువ వేతనాలకే సమర్థవంతంగా పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే వారిని పనిలో పెట్టి రెగ్యులర్ ఉద్యోగులను తొలగించిందీ కంపెనీ. ఇక తొలగించిన ఉద్యోగులను ఉత్త చేతులతో పంపకుండా తగిన పరిహారం అందజేసినట్లు ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆటో ఇండస్ట్రీ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.