మంత్రి కేటీఆర్ (KTR) బుధవారం నిజామాబాద్ (Nizamabad) లో పర్యటించారు. స్థానికంగా నిర్మించిన ఐటీ టవర్ (IT Tower)ను ప్రారంభించారు. అయితే.. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వివిధ విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు. విద్యాలయాలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చౌరస్తాలో కారుకు అడ్డుగా వెళ్లారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసులు (Police) వారిని అరెస్ట్ చేశారు.
3.20 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నిజామాబాద్ ఐటీ హబ్ లో వివిధ కంపెనీల కార్యకలాపాల కోసం 50,000 చదరపు అడుగుల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 15 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ నూతన భవనం రూ. 22 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసిన రఘునాథ చెరువును కూడా కేటీఆర్ ప్రారంభించారు.
ఇటు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి. 2004లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1200 అయిందని అన్నారు. రూ.400 ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని 400 తిట్లు తిట్టారని.. ఇప్పుడు రూ.1200 చేసిన వాళ్లను ఎన్ని తిట్లు తిట్టాలని సెటైర్లు వేశారు. 70 రూపాయల పెట్రోల్ ను 120 రూపాయలు చేశారని కేంద్రంపై ఫైరయ్యారు. ఈ తొమ్మిదేళ్లలో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందని.. కానీ, కేసీఆర్ (KCR) సీఎం అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు కేటీఆర్.
ఐటీ హబ్ (IT HUB) అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదని.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. భవిష్యత్ లో వారు హైదరాబాద్, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడ ఎక్కేందుకే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఉద్యోగాలు కావాలన్నా.. మీరే ఇచ్చే స్థాయికి ఎదగే నైపుణ్యం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి.. మన భవిష్యత్ భద్రంగా, తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలంటే.. ఇలాంటి సదుపాయాలను అందిపుచ్చుకోవాలని అన్నారు కేటీఆర్.