సీనియర్ నటి, మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ (Mandya MP) సుమలత అంబరీష్ (MP Sumalatha Ambareesh) భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరారు. తాను బీజేపీలో చేరతానని ఇటీవలే సుమలత ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఉదయం బీజేపీ కండువా కప్పుకున్నారు.
కర్ణాటకలో బీజేపీ సీట్ షేరింగ్ ఫార్ములాను అవలంభిస్తోంది. దీని ప్రకారం బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. జేడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తోంది. ఈసారి మాండ్య నుంచి జేడీఎస్ పోటీలో నిలబడనుంది. తాను స్వతంత్య్ర ఎంపీగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి రూ.4వేల కోట్లను విడుదల చేసినట్లు సుమలత వెల్లడించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేయడానికి బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవల మాండ్య నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని సుమలత గుర్తుచేసుకున్నారు. తాను మాండ్య జిల్లా ‘కోడలు’గా చెప్పుకొచ్చారు.
తనను ఇతర జిల్లాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రతిపాదించిందని అన్నారు. అయితే అందుకు తాను తిరస్కరించానని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంతమంది కోరినప్పటికీ ఆత్మాభిమానం ఉన్నవారెవరూ ఆ పార్టీలో చేరాలని అనుకోరంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. ఆమె బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.