ఏపీ(AP)లో కుదిపేసిన వివేకా హత్య(Viveka Murder)కు సంబంధించి ఆయన కూతురు సునీతారెడ్డి ఇప్పటికే అనేక సంచలన విషయాలను బయటపెట్టారు. తాజాగా అమరావతి(Amaravathi)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య జరిగాక జగన్ తనతో తోలుబొమ్మలాట ఆడారని ఆరోపించారు.
ఎవరైనా ఒకసారి మోసం చేయవచ్చని, పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మానని, ఇప్పుడు తప్పును గ్రహించాను కాబ్టే ధైర్యంగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. జగన్ ఒక అన్నగా కాకున్నా సీఎంగా అయినా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని, అవినాష్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.
‘ఈ కేసులో అవినాష్ ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంతభయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే నేరుగా మీ ఛానల్‌కు వస్తా.. డిబేట్ పెట్టండి.. నిజానిజాలు బయటకు వస్తాయి.. ఎవరేం చెబుతున్నారో ప్రజలే అర్థంచేసుకుంటారు’ అని అన్నారు. అదేవిధంగా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిలకు సునీత అభినందనలు తెలిపారు.
ఆమెకు తన మద్దతు ఉంటుందన్నారు. షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలని తన తండ్రి శాయశక్తులా ప్రయత్నించారని, ఈ క్రమంలోనే హత్యకు గురయ్యారని సునీతారెడ్డి అన్నారు. కష్టపడి వైసీపీని నిలబెట్టిన తర్వాత తను షర్మిల పవర్ఫుల్ అవుతుందని భయపడి జగన్ ఆమెను పక్కన పెట్టారన్నారు. 2సంవత్సరాల ముందు నేను, నా భర్త సాక్షులను ప్రభావితం చేస్తున్నామని కేసు పెట్టారని గుర్తుచేశారు.
వివేకా జీవిత ఆధారంగా తెరకెక్కించిన ‘వివేకం’ సినిమాను తాను చూశానని, ఆ సినిమాలో కంటే రియాలిటీ చాలా దారుణంగా ఉందన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి ప్రజలకు మంచి జరగదని, అందుకే నిజం చెప్పడానికి ముందుకొచ్చానని సునీతారెడ్డి చెప్పారు. తనతో పాటు షర్మిల పోరాటం ఒకటేనని అన్నారు. ఇప్పటికీ తమ ధ్యేయం జగన్, అవినాశ్‌ను ఓడించడమేనని తెలిపారు. ఆలస్యమైతే పదేపదే పోటీ చేస్తారు.. నేరస్తులు చట్టసభలకు రాకూడదు అని సునీతారెడ్డి అన్నారు.