యోగా గురువు రాందేవ్ బాబా (Ramdev baba)పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రజలను తప్పుతోవ పట్టించేలా పతంజలి(patanjali) ప్రకటనలు ఇస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం (Supream court) దీనిపై వివరణ ఇవ్వాలని రాందేవ్ బాబాకు నోటీసులు (Notices issued) జారీ చేసింది. అయితే, దానిపై ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
తాజాగా మరోసారి రాందేవ్ బాబా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం రాందేవ్ బాబాపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు పతంజలి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు (Balakrishna) కూడా కోర్టు సమన్లు పంపింది. పతంజలి పై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
పతంజలి ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడంపై రాందేవ్ బాబా, పతంజలి సీఈవో బాలకృష్ణకు గత నెల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై గతేడాది నవంబర్ నెలలో విచారణ జరిపిన కోర్టు.. అసత్య ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించగా అందుకు రాందేవ్ బాబా, బాలకృష్ణ అంగీకరించారు. తాజాగా వాటిని మరోసారి ఉల్లంఘించడంతో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు వారిద్దరికి సమన్లు జారీచేసింది.