తమిళనాడులో డీఎంకే (DMK) సర్కార్కు సుప్రీం కోర్టు (Supreme Court) లో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయాల్లో అర్చకుల నియామకానికి సంబంధించి యథాతథ స్థితిని (Status Quo) కొనసాగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో నాస్తిక డీఎంకే ఇకనైనా వెనక్కి తగ్గాలని హిందూ సంఘాలు అంటున్నాయి.
అర్చక సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టి వేయాలని ధర్మాసనాన్ని అర్చక సమాఖ్య తరఫున న్యాయవాదులు జీ. బాలాజీ, వల్లియప్పన్ కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో అర్చకత్వ సర్టిఫికెట్ కోర్సు చేసిన ఇతర మతాలకు చెందిన వారికి కూడా అర్చకత్వంలో అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఆగమ ఆలయాల్లో ఓ ప్రత్యేక వర్గానికి చెందిన వ్యక్తులను అర్చకులుగా నియామకం అనే వంశపారంపర్య పథకానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నూతన ఆదేశాల ద్వారా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవ, వైష్ణవ ఆలయాలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్మించారని అన్నారు. అందువల్ల ఆలయాల్లో కూడా ఆగమ శాస్త్ర ప్రకారం జరగాలన్నారు.
గతంలో సుప్రీం కోర్టు, మద్రాసు హైకోర్టుల ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని గౌరవించకుండా నాస్తికులను అర్చకులుగా నియమించేందుకు తమిళనాడు డీఎంకే సర్కార్ చూస్తోందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే డీఎంకే సర్కార్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు.
తమిళనాడులోని ప్రముఖ శైవ మరియు వైష్ణవ ఆలయాలు ఆగమాలను అనుసరించి నిర్మించబడ్డాయి మరియు వాటిలో పూజలు ఆగమాల ప్రకారం జరుగుతాయని పిటిషనర్ అసోసియేషన్ ఎత్తి చూపింది. అనంతరం ఈ కేసులో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆగమ ఆలయాల్లో అర్చకత్వానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగుతుందని జస్టిస్ బోపన్న వెల్లడించారు.