ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే కొత్త కెప్టెన్లను నియమిస్తున్నాయి. తాజాగా టీమిండియా (Team India) తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అతడు హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో మిస్టర్ 360 ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే.. ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ(Rohit Sharma)ను కాదని హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు బాధ్యతలు అప్పగించడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. గత కొన్నేళ్లుగా రోహిత్, సూర్య ముంబైకి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు మింగుడు పడట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా, రోహిత్ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రేసులో ఉన్న సీనియర్లకు కూడా ఇది రుచించడం లేదు. స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడమే కారణమా?’, ‘సూర్య ముంబై కెప్టెన్సీ ఆశించాడా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, ముంబై ఫ్రాంచైజీ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను తిరిగి దక్కించుకుంది. దాంతో అప్పటి నుంచి రోహిత్ వారసుడు పాండ్యానే అనే వార్తలు బలంగా వినిపించాయి. దీంతో ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ‘సైలెన్స్’ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.