ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని (Intermediate Secondary Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట(Suryapet) మండలం ఇమాంపేట(Imampeta) సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. బైపీసీ సెకండియర్ చదువుతున్న వైష్ణవి శనివారం రాత్రి డార్మెటరీ హాల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
కాలేజీలో ఫేర్వెల్ పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులు, ఉపాధ్యాయులంతా కాలేజీలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. డార్మెటరీ హాల్‌కు వెళ్లిన విద్యార్థిని వైష్ణవి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు వెళ్లి చూడగా అప్పటికే వైష్ణవి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీంతో వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు.
వైష్ణవి కొన ఊపిరితో ఉండగా అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన కూతురు ఆత్మహత్యకు కళాశాల అధ్యాపకులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో వైష్ణవి ఉపాధ్యాయులను ప్రశ్నించిందని దాన్ని మనసులో పెట్టుకున్న స్కూల్ ఉపాధ్యాయులు వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.